Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ సస్పెన్షన్ తాత్కాలికమే... మళ్లీ వస్తా: దువ్వాడ శ్రీనివాస్

Duvvada Srinivass Response to YSCP Suspension
Advertisement
  • క్రమశిక్షణ పరమైన కారణాలతో దువ్వాడపై సస్పెన్షన్ వేటు
  • ఇటీవలే సస్పెండ్ చేసిన వైసీపీ హైకమాండ్
  • పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశానన్న దువ్వాడ
  • రాజకీయ క్రీడలో బలైపోయానేమో అనిపిస్తోందని వెల్లడి
Advertisement
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను క్రమశిక్షణ పరమైన కారణాలతో వైసీపీ నుంచి సస్పెండ్ చేయడం తెలిసిందే. తన సస్పెన్షన్ పై దువ్వాడ శ్రీనివాస్ ఓ వీడియోలో స్పందించారు. ఈ నెల 22న వైసీపీ తనను సస్పెండ్ చేసిందని, ఆ మేరకు విడుదల చేసిన ప్రకటనపై తన అభిప్రాయం తెలియజేస్తున్నానని వెల్లడించారు. 

"వైసీపీ గురించి మాట్లాడుకునే ముందు జగన్ గారి గురించి మాట్లాడుకోవాలి. నాకు ఈ స్థాయిని, హోదాను ఇచ్చింది జగనే... అందుకు గాను ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీ కోసం నేను చాలా కష్టపడి పనిచేశాను... పార్టీకి గొంతుకలా మారాను... నాడు ప్రతిపక్షాల మీద గట్టిగా విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసిన నన్ను... అకారణంగా, వ్యక్తిగత కారణాలు అనే కారణంతో సస్పెండ్ చేశారని తెలిసింది. నా హృదయంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ నిలిచి ఉంటారు. అయితే, రాజకీయ క్రీడలో నేను బలయ్యానేమో అనిపిస్తోంది. 

పాతికేళ్లుగా ప్రజా జీవితంలో ఉంటూ, ప్రజాసేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు, భూకబ్జాలు చేయలేదు... పార్టీ కోసమే అహర్నిశలు పనిచేశాను. తాజాగా జరిగిన పరిణామాన్ని స్వీకరిస్తున్నాను. 

సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామం అని అర్థం. ఈ తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకొకటి గుర్తొస్తోంది. గురజాడ అప్పారావు గారు ఓ మాట చెప్పారు... విజయం కోసం విసుగును వీడి విరామమెరుగక పనిచేయండోయ్ అన్నారు... నేను కూడా ఆ విధంగానే విరామం లేకుండా పనిచేస్తాను... కష్టపడి పనిచేస్తాను... స్వతంత్రుడిగా, తటస్థుడిగా, నన్ను నమ్ముకున్న ప్రజల కోసం, నా గ్రామాల కోసం, నాపై ఆధారపడి ఉన్న కార్యకర్తల కోసం, అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో  పనిచేస్తాను... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామగ్రామాల్లో ఇంటింటికీ ఈ దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ వస్తాడు... అన్నింటికీ కాలమే తీర్పు చెబుతుంది. 

నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన టెక్కలి నియోజకవర్గ ప్రజలను ఎప్పటికీ మర్చిపోను. నా ఊపిరి ఉన్నంత వరకు వారి సేవలోనే నిమగ్నమై ఉంటాను. నా సేవలు ఎక్కడ అవసరమైతే అక్కడ నేను ప్రత్యక్షంగా ఉపయోగపడతాను. ఇప్పటివరకు అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ కు నా హృదయపూర్వక నమస్కారాలు" అంటూ దువ్వాడ శ్రీనివాస్ తన వీడియోలో పేర్కొన్నారు.
Advertisement
Advertisement
Duvvada Srinivas
YSCP Suspension
Andhra Pradesh Politics
Jagan Mohan Reddy
MLC
Telugu Desam Party
Indian Politics
Suspension from Party
Political Career

More Telugu News